Monday 7 May 2012

ఉడిపి హోటళ్ళు.. రాజకీయ విశ్లేషణ


సమయం ఉదయం తొమ్మిది గంటలు, ఈ సమయంలో రోజూ నేను 'హిందూ'లో వార్తలు చదువుతూ తీవ్రంగా ఆలోచిస్తుంటాను. 

ఇంతలో హడావుడిగా సుబ్బు వచ్చాడు.

వస్తూనే - "రవణ మావా! కాఫీ. అర్జంట్." అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"ఇందాక  మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ కొడుకు కనిపించాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎట్లాంటి గుంటూరు ఎట్లా అయిపొయింది మావా! ఒకప్పుడు మైసూర్ కేఫ్, శంకర విలాస్ ఊరికి మకుటాయమానంగా ఉండేవి. ఇప్పుడవి మాయమైపొయ్యాయి, ఎంతైనా ఆ రోజులే వేరు." నిట్టూర్చాడు సుబ్బు.

"సుబ్బూ! ఆపుతావా నీ వెధవ హోటళ్ళ గోల. దేశ రాజకీయ పరిస్థితి అస్సలు బాలేదు. నీకేమో పొద్దస్తమానం తిండి, హోటళ్ళే ప్రపంచం. వాటిల్లోంచి కొద్దిగా బయటకి రా! ఆలోచనా స్థాయి పెంచుకో!" విసుక్కున్నాను.

సుబ్బుకి నా మాటలు నచ్చలేదు.

"ఏంటీ? నాది వెధవ గోలా! 'హిందూ' చదివి దేశ రాజకీయాలు అర్ధం చేసుకునే దుస్థితిలో నువ్వున్నావు - నేన్లేను. కాదేది కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ, కాదేది రాజకీయ విశ్లేషణ కనర్హం అంటున్నాడీ సుబ్బు. కాఫీ హోటళ్ళ చరిత్రతోనే దేశ రాజకీయాలు కూడా అర్ధం చేసుకోవచ్చు, కానీ - ఆ విషయం నీకు తెలీదు. ఐ పిటీ యు!" అన్నాడు సుబ్బు. 

'హిందూ' పక్కన పడేశాను.

"ఏంటి సుబ్బూ నువ్వు చెబ్తుంది? కాఫీ హోటళ్ళకి దేశ రాజకీయాలకి సంబంధం ఉందా? ప్రూవ్ ఇట్." చాలెంజింగ్ గా అన్నాను.

సుబ్బూ ఒక్కక్షణం ఆలోచించాడు.

"ఓకే! మనకి ప్రతి ఊళ్ళో ఉడిపి హోటళ్లున్నాయ్. ఉడిపి వారు కష్టజీవులు, వారిలో ఎక్కువమంది అడ్డ పంచెలతో, పొట్టచేత పుచ్చుకుని ఉడిపి నుండి వలస వచ్చినవారే. వచ్చిన కొత్తలో తమ ఉడిపి హోటళ్ళలోనే వంటవాళ్ళగానో, సప్లైయర్లుగానో పనిచేస్తారు. వ్యాపార మెళకువలు నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, స్నేహాలు పెంచుకుంటారు. కొంతకాలానికి హోటల్ వ్యాపారానికి అనువైన ప్రదేశం గుర్తిస్తారు. కొద్ది పెట్టుబడితో చిన్న టిఫిన్ సెంటర్ మొదలెడతారు. శుచి, శుభ్రత, రుచి మైంటైన్ చేస్తూ, చాలా కస్టమర్ ఫ్రెండ్లీగా, నిజాయితీగా వ్యాపారం చేస్తారు. సహజంగానే వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొంతకాలానికి ఆ టిఫిన్ సెంటర్ ఒక చిన్నహోటల్ గా, అటుతరవాత ఒక పెద్దహోటల్ గా అభివృద్ధి చెందుతుంది."

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీని సిప్ చేస్తూ, ఆలోచిస్తూ మాట్లాడటం కోనసాగించాడు సుబ్బు.  

"ఇప్పుడు మనం ఈ హోటళ్ళ సక్సెస్ స్టోరీని రాజకీయాల్లోకి తీసుకొద్దాం. మనదేశంలో వామపక్షాలు, బిజెపికి (కనీసం ఆన్ పేపర్) కొన్ని సిద్ధాంతాలున్నాయ్. కాబట్టి వాటిని పక్కన పెడదాం. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకవ్యక్తి పార్టీలే. ఆ పార్టీలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కులం, ప్రాంతం వంటి అంశాలని ఆధారం చేసుకుని ఏర్పడ్డాయ్. ప్రజల అవసరాలు, అవస్థలకి ప్రతిభావంతంగా స్పందించిన పార్టీలకి సహజంగానే ప్రజాదరణ వస్తుంది, అధికారమూ వస్తుంది. కాబట్టి - ఒక రాజకీయ పార్టీ పుట్టుక, ఎదుగుదల ఉడిపి హోటల్ చరిత్రని పోలి ఉంటుంది."

ఇంతలో నాకు ఫోనొచ్చింది.

"డాక్టర్ గారు! మా అబ్బాయికి ఎల్కేజీ పబ్లిక్ పరీక్షలో అరమార్కు తగ్గింది, ఇంక నేను బ్రతకడం అనవసరం, చచ్చిపోవాలనిపిస్తుంది." అంటూ ఓ కన్నతల్లి ఏడవసాగింది.

"అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది! టెన్షనొస్తే వేస్కోమని ఓ మాత్రిచ్చా గదా? అది మింగి పడుకో తల్లీ!" అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. 

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

" మన ప్రాంతీయ పార్టీల పునాది, పెట్టుబడి ఆ పార్టీ స్థాపకునికి ఉన్న జనాకర్షణే. ఇందుకు ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లే ఉదాహరణ. కొన్నాళ్ళకి వాళ్ళు ముసలాళ్ళైపోతారు. మారుతున్న సమాజానికి కొత్త సమస్యలు ఎదురౌతుంటాయి. కుర్రఓటర్ల ఆలోచనలకి తగ్గట్లుగా ఈ పార్టీలలో మార్పులు రావాలి. అనగా ఓటర్లలో తరం మారినట్లే నాయకత్వంలో కూడా తరం మారాలి. అయితే ఈ మార్పు ఎంత స్మూత్ గా ఉంటే అంత మంచిది. అంటే - నెమ్మదిగా తండ్రుల స్థానంలో కొడుకులు రంగంలోకి రావాలి, తండ్రి ఆస్థి చెందాల్సింది కొడుక్కే గదా!"  

ఇప్పుడింకో పేషంట్ దగ్గర్నుండి ఫోన్.

"డాక్టరు గారు! నాకు చేతబడి చేయించిన వాడెవడో తెలిసి పోయింది. వాడెవడో కాదు, మా బామ్మర్దే!" అవతలి గొంతు చాలా ఉత్సాహంగా ఉంది.

"ఇంత ముఖ్యమైన విషయం ఫోన్లో మాట్లాడుకుంటే కుదర్దు. మీరే రండి, మాట్లాడుకుందాం."అంటూ ఫోన్ పెట్టేశాను.

సుబ్బు చెప్పసాగాడు.

"నాకు తెలిసి హోటళ్లు మేన్ మేనేజ్మెంట్ కి గొప్ప ఉదాహరణ. క్లీనర్లు, సప్లయర్లు, వంటవాళ్ళు.. అనేక వయసులవారు నిరంతరం పన్జేస్తూనే ఉంటారు. కొందరు హోటల్ పుట్టుక నుండి విశ్వాసంగా ఉంటారు, ఇంకొందరు పనిదొంగలు. ఎవరేమిటి? అన్నది ఓనర్ గ్రహించాలి. హోటల్ కష్టమర్లూ రకరకాలు. ఎక్కువమంది రెగ్యులర్ కస్టమర్లు, వారితే సత్సంబంధాలు కలిగుండాలి. ఇదంతా చెయ్యాలంటే - ఎంతో తెలివి, ష్రూడ్ నెస్ కలిగుండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇవన్నీ ఆచరణలో పెట్టాడు గనకనే మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ అద్భుత విజయం సాధించాడు. నా అభిప్రాయం ఆయనకి బిజినెస్ మేనేజ్మెంటులో ఒక గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి. అంతేకాదు - IIM లో ఉపన్యాసం ఇప్పించాలి." 

"సుబ్బూ! మనం మైసూర్ కేఫ్ లో సాంబారు కనీసం లక్షలీటర్లు తాగుంటాం కదూ!" తన్మయత్వంతో అన్నాను.

"లక్షలీటర్లు కాదు, లక్షగ్యాలన్లు అన్నది కరెక్ట్. శంకరనారాయణ ఏనాడూ ఓనరుగా ప్రవర్తించలేదు. పనివాళ్ళతో కలిసిపోయి హోటల్ని నడిపాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన పిల్లలు చదువుకున్నారు, అంచేత వాళ్లకి హోటల్ పని మోటుగా అనిపించింది. వయసు మీద పడటంతో తన హోటల్ వ్యాపారం కొడుకులకి అప్పజెప్పాడు శంకరనారాయణ. వాళ్ళవి రాంగ్ స్ట్రాటజీస్, అందుకే - డైరక్టుగా క్యాష్ కౌంటర్ ముందు కూర్చున్నారు. వంటగది వైపు తొంగి కూడా చూసేవాళ్ళు కాదు. ఫలితంగా ఇడ్లీ వేడి తగ్గింది, సాంబారు రుచి తగ్గింది, హోటలుకి బిజినెస్ తగ్గింది." అన్నాడు సుబ్బు.

"శంకరనారాయణ బిజినెస్ మోడల్ గూర్చి నీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ దాంతో దేశ రాజకీయాలకేం సంబంధమేంటి?" ఆసక్తిగా అడిగాను.

"చాలా సంబంధం వుంది. ఉదాహరణకి - ఉత్తర ప్రదేశ్ లో మూలాయం మంచి హోటల్ నడిపాడు. మనిషి పాతబడ్డాడు, బిజినెస్ తగ్గింది. ఈలోగా కొడుకు అఖిలేష్ చేతికందొచ్చాడు. అఖిలేష్ హోటల్లో డైరెక్టుగా క్యాష్ కౌంటర్లో కూర్చోకుండా, ప్లేట్లు కడగడం దగ్గర్నుండి దోశెలెయ్యడం దాకా అన్నిరకాల పనులు చేశాడు. వ్యాపారంలో కష్టనష్టాలు అర్ధం చేసుకోడానికి సైకిల్ యాత్రంటూ కష్టపడ్డాడు, పార్టీకి కొత్తరక్తం ఎక్కించాడు. ఫలితంగా హోటల్ వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు తండ్రి కొడుక్కి క్యాష్ కౌంటర్ అప్పచెప్పాడు. కుర్ర కస్టమర్ల అభిరుచులు కొడుకు చూసుకుంటుంటే, ముసలి కస్టమర్ల కోసం తండ్రి ఎలాగూ ఉన్నాడు. ఇది డెడ్లీ కాంబినేషన్." అన్నాడు సుబ్బు.

"ఓకే! మరి మన ఆంధ్రా రాజకీయాలు?" అడిగాను.

"తెలుగు దేశం పార్టీ అనే ఉడిపి హోటల్ని చంద్రబాబు బాగానే నడిపాడు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. కుర్ర కస్టమర్లకి చంద్రబాబు మెనూ నచ్చడం లేదు. ఇప్పుడిక తెలుగు దేశం పార్టీ నాయకత్వ మార్పిడి స్మూత్ గా జరగవలసిన సమయం ఆసన్నమైంది." అన్నాడు సుబ్బు.

"మరింక లేటెందుకు? హాయిగా లోకేశ్ కుప్పం నుండి సైకిల్ యాత్ర మొదలెట్టెయ్యొచ్చుగా?" అడిగాను.

"వచ్చు, కానీ - ఇక్కడొక చిక్కుంది. తెలుగు దేశం హోటల్ ఓనర్షిప్ చంద్రబాబుది కాదు, ఆ హోటల్ ఆయనకి పిల్లనిచ్చిన మామది. వంటశాలలో ఓమూల ఇడ్లీలేసుకుంటూ బ్రతికేస్తానని మామని నమ్మబలికి, క్రమంగా మామ క్యాష్ కౌంటర్ కే ఎసరుబెట్టాడు చంద్రబాబు. అసలు ఓనరైన ఎన్టీఆర్ వారసులకి హోటల్ నడిపే ఓపికా, యోగ్యతా లేవు. కానీ - ఎప్పటికైనా ఆ హోటల్  తమమదేనని అప్పుడప్పుడు గర్జిస్తుంటారు. చంద్రబాబు మింగాలేడు, కక్కాలేడు. ఏమీ చెయ్యలేని పరిస్థితి." అన్నాడు సుబ్బు.

"మరి జగన్ సంగతి?"

"రాజశేఖర రెడ్డి 'కాంగ్రెస్' అనే హోటల్ని అద్భుతంగా నడిపాడు. అయితే - ఆయన 'కాంగ్రెస్ హోటల్'కి యజమాని కాదు, బ్రాంచి మేనేజర్ మాత్రమే. గాంధీ కుటుంబానికి చెందిన ఆ హోటల్ హెడ్డాఫీసు ఢిల్లీలో ఉంది. సోనియా గాంధీకి తన హోటల్ హైదారాబాద్ బ్రాంచి మీద హక్కులు జగన్ లాగేసుకుంటాడనే భయం పట్టుకుంది. తమ హోటల్ కి వ్యాపారం తగ్గినా పర్లేదు గానీ, అన్ని హక్కులు తన ముద్దుల కొడుకు రాహులుడికి చెంది ఉండాలని నిశ్చయించుకుంది. అందుకే జగన్ కి మొండిచెయ్యి చూపింది." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"జగన్ తొందరపడ్డాడేమో?"

"నేనలా అనుకోవడం లేదు. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డికి క్యాష్ కౌంటర్ అప్పచెప్పారో అప్పుడే జగన్ కి ఢిల్లీ తాత్పర్యం అర్ధమైపోయింది. అతనికి ఎదురుగా చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి కొడుకులు కనిపిస్తున్నారు. వాళ్ళు సంవత్సరాలు తరబడి సప్లయిర్లుగా పనిచేస్తూనే ఉన్నారు. సోనియాగాంధి వాళ్ళకి కనీసం జీతం పెంచిన పాపాన పోలేదు. ఆవిడ ఉద్దేశ్యం జగన్ని కూడా సప్లయిర్ గా నిరంతరం పని చెయ్యమనే!" అన్నాడు సుబ్బు.

"అవును గదా! ఈ పాయింట్ నాకు తట్టనేలేదు సుమీ!" అన్నాను.

"జగన్ క్యాష్ కౌంటర్ పోస్ట్ కి తప్ప దేనికీ ఒప్పుకోడు. అంచేత - అతనికిప్పుడు వేరే ఆప్షన్ లేదు. అందుకే ఫ్రెష్షుగా ఇడ్లీపాత్ర, పెనం కొనుక్కుని, కాంగ్రెస్ హోటల్ ఎదురుగానే చిన్నహోటల్ సొంతంగా మొదలెట్టాడు. తన తండ్రి వంట రుచి చూసి ఆదరించిన పాత కస్టమర్లు వస్తారని ఆశ. అలాగే కస్టమర్లక్కూడా జగన్ హోటల్ టిఫిన్ల గూర్చి అవగాహన ఉంది. సక్సెస్ కి అడ్డదారులు లేవు మిత్రమా! కష్టపడాలి, అందుకే - జగన్ కష్ట పడుతున్నాడు. ఎండనకా, వాననకా ఓదార్పు యాత్రంటూ తిరుగుతున్నాడు." అన్నాడు సుబ్బు. 

"కిరణ్ కుమార్ రెడ్డి?"

"మన ముఖ్యమంత్రికి ఇడ్లీకి, అట్టుకి తేడా తెలీదు. అతనికి ఇంతకుముందు రాజశేఖరరెడ్డి హయాంలో క్లీనర్ గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ తెలీకపోవడమే అతని అర్హత, అదే అతనికి ప్లస్సయింది.. ఢిల్లీ పెద్దలకి భలే నచ్చింది. అందుకే ఇప్పుడు క్యాష్ కౌంటర్లో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. అందుకే - ఆయన కన్నా ఎక్కువ స్థాయిలో (సప్లయిర్లుగా) పన్జేసిన సత్తి బాబు, డి.ఎల్. రవీంద్రారెడ్డిలు కిరణ్ని చూసి గుర్రుమంటున్నారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! బాగా చెప్పావు. ఉడిపి హోటళ్ళ చరిత్రని తెలుసుకుంటే దేశరాజకీయాలు కూడా అర్ధమైపొతాయన్నమాట! నీ హోటల్ రాజకీయ పురాణం బాగుంది." నవ్వుతూ అన్నాను.

సుబ్బూ టైమ్ చూసుకుంటూ లేచి నిలబడ్డాడు.

"రవణ మావా! నేవెళ్తున్నా. దార్లో అమ్మకి చింతలూరివారి మాదీఫల రసాయనం కొనుక్కెళ్ళాలి. నువ్వు నీ 'హిందూ' శ్రద్ధగా చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకో. వస్తా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(picture courtesy : Google)

41 comments:

  1. హోటల్ లాజిక్ బ్రహ్మాండంగా ఉంది.

    ReplyDelete
  2. "నాకు ఫోన్ వచ్చింది. "డాక్టర్ గారు! మా అబ్బాయికి ఎల్కేజీ పబ్లిక్ పరీక్షలో అర మార్కు తగ్గింది. నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది." అంటూ ఒక కన్న తల్లి ఏడవసాగింది. నాకు చికాకేసింది. "నేను ఊళ్ళో ఉండట్లేదు. మీరు వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి." అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి.. సుబ్బు వైపు తిరిగాను."

    రమణా, నీ ప్రయార్టీలు నాకు బాగా నచ్చాయి! హౌ డేర్? ఇదేమైనా ఆత్మ హత్య లైన్ అనుకున్నారా పేషంట్లు?! ;-)
    గుడ్ టు సీ యూ బ్యాక్ ఇన్ ఫుల్ ఫార్మ్!! రెస్టారెంట్ల కథ తో రాజకీయ శాస్త్రాన్ని చక్కగా వివరించావు. మెన్యూ బాగుంది!!!
    బి ఎస్ ఆర్

    ReplyDelete
  3. మైసూర్‌కెఫేలో వూడ్పుడుకాడుగా(స్వీపర్) పనిచేసిన కాకాసురుడికి పెసిరెంట్ నౌక్రీ బంగారమ్మ ఎందుకివ్వట్లేదు? మీ సుబ్బును అడిగి చెబుతారా? :)

    ReplyDelete
  4. రమణ గారు మనలో మనమాట ఇంతకీ గుంటూరులో మైసూరు కేఫ్ ఎక్కడండి?నేను గుంటూరు వదిలేసి పాతిక కాదు ఇరవై ఆరేళ్ళు అయ్యింది మర్చిపోయానేమో అని అనుమానం.

    ReplyDelete
  5. Rao S Lakkaraju గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. @GIdoc,

    హ.. హ.. హా.

    పెద్ద పేరాగ్రాఫ్స్ ని బ్రేక్ చెయ్యడానికి phone conversations ఇరికించాను. వాస్తవానికి హాస్పిటల్ ఫోన్ నేను డైరెక్టుగా రిసీవ్ చేసుకోను. unknown numbers సెల్ కాల్స్ కూడా ఇగ్నోర్ చేస్తాను.

    ఒకవేళ suicide intention తో మాట్లాడుతున్న కాల్ రిసీవ్ చేసుకుంటే మాత్రం.. i don't think i have the luxury of ignoring such calls!

    this write up is a tribute to our mysore cafe!

    ReplyDelete
  7. Fantastic, mind blowing, unbelievable comparison.

    ReplyDelete
  8. @SNKR,

    స్వీపర్లు, క్లీనర్లు, సప్లయర్లు, వంటవారు.. క్రమం తప్పకుండా 10 janpath జరిపే బానిసత్వ పరీక్షల్లో తప్పనిసరిగా పాసవ్వాలి. కాకాసురుడు ఎందుకు ఫెయిలయ్యాడో మనకి తెలీదు.

    రాజకీయంగా అయితే అంచనా వెయ్యగలం గానీ.. ఈ వినయ విధేయతా శీల పరీక్షల్ని విశ్లేషించడం కష్టం!

    సుబ్బు నడిగి చెబుతాలేండి!

    ReplyDelete
  9. బాగుంది. మరి మన రెడ్డి ( కాకీ నిక్కరు, తెల్ల బనీను క్లీనర్) గురించి రాయకుండా ముగించడం ఏమీ బాగా లేదు.
    నాన్నా ...
    డాక్టర్ గారికి ఒక మసాలా ..

    ReplyDelete
  10. తండ్రి ఇడ్లీ కొడుకు ఇడ్లీ
    రెండూ తప్పే

    డబ్బులు నాలాంటి పన్ను కట్టే వాళ్ళవి లాభాలు అనుభవించడానికి తండ్రి కొడుకులకు ఏమి అర్హత ఉంది?

    ReplyDelete
  11. రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు,

    మైసూర్ కేఫ్ (వాస్తవానికి కఫే అనాలి. కానీ అలా రాస్తే నాకే అర్ధం కాదు.) బ్రాడీపేట నాలుగో లైన్లో, రవి కాలేజ్ పక్కన ఉండేది. ఎదురుగా హిందూ ఆఫీస్ ఉంటుంది. 70s, 80s లో చాలా పాపులర్ హోటల్. గుర్తొచ్చిందనుకుంటాను.

    ReplyDelete
  12. kastephale గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  13. యమ్ సెట్ కోచింగ్ రోజుల్లో రవికాలేజీ దాకా,మామూలు రోజుల్లో బీ హెచ్ సీ దాకా బ్రాడీపేట సర్వే,అయితే హోటళ్ళ సంగతికొస్తే (తప్పనిసరి తద్దినం) శంకర్ విలాస్,హనుమాన్ స్వీట్స్,శ్రీవెంకటేశ్వరా విలాస్(రెండూ జిన్నా టవర్ దగ్గర)నాజ్ సెంటర్లో రామచంద్ర,ఇక ఎటూ గీతాకేఫ్ ఉందిగా,భోజనం చేయాల్సొస్తే ఆనందభవన్ అదండీ మా హోటళ్ళ తిరుగుళ్ళు.అందుకే మైసూరు కేఫ్ దాకా రాలేక పోయాము

    ReplyDelete
  14. రమణ గారు చాలా బాగా రాశారు.....

    ReplyDelete
  15. @putcha,

    అయ్యో! రెడ్డిని ఎలా మర్చిపోతాను! ఒక్క మైసూర్ కేఫ్ గూర్చే పూర్తి పోస్ట్ రాస్తాను. అప్పుడు మనం రెడ్డి, రాజగోపాల్, రామచంద్ర, బాలయ్య.. అందరి గూర్చి మాట్లాడుకోవచ్చు.

    ఇవ్వాళ పోస్టులో చంద్రబాబు, జగన్లు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళ మధ్యన చిన్నవాళ్ళెందుకులే అని.. క్లుప్తంగా రాశాను.

    ReplyDelete
  16. narsi గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  17. రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు,

    నేను చెప్పదలచుకున్న విషయానికి మైసూర్ కేఫ్ వాడుకున్నాను. అంతే! అంతకు మించి ఈ టపాలో ఫలానా హోటల్ అంటూ దేనికీ అంత ప్రాధాన్యం లేదు.

    ఈ రోజుల్లో ఏ పదవీ తండ్రి పేరో, తాత పేరో చెప్పినంత మాత్రానికే ఒళ్ళో వచ్చి వాలిపోయ్యే అవకాశం లేదు. కుక్కలా కష్టపడాల్సిందే!

    ఇంతకీ మన రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ ఎవరు?!

    ReplyDelete
  18. ఇరగదీసి ఇశ్లేషించావ్!!! ఏసుకో ఇంకో రెండిడ్లీలు !!! మైసూర్ కఫే "టిఫిన్లకత్యుత్తమం" అందులో ఇడ్లీ, తోలూడే వేడితో సాంబారుకి ప్రసిద్దం!!! సుబ్బు అన్నట్ట్లు ఒక లక్ష గాలన్లు వేసే ఉంటాం. రోజుని ఆ టిఫిన్ తో మొదలెడితే మిగతా రోజంతా సజావుగా సాగుద్దని మన నమ్మకం ఆరోజుల్లో!!!ఇక రాజకీయాలంటావా ఆ ఎప్పుడూ ఉండే ఎదవ గోలే కానీ సామరస్యం ఆ సాంబారులాగానే అమోఘం!! - గౌతం

    ReplyDelete
  19. TJ "Gowtham" Mulpur,

    'మైసూర్ కేఫ్ సాంబార్' అనంగాన్లే ఈ రోజుకీ నోట్లో నీళ్ళూరుతున్నాయని నీ వ్యాఖ్యతో అర్ధమైంది.

    >>ఏసుకో ఇంకో రెండిడ్లీలు !!!<<

    థాంక్యూ! ఇంతకీ.. బిల్లు కట్టేది నువ్వేగా?!

    ReplyDelete
  20. ఇన్ని రోజుల తరువాత 'మైసూరు కేఫ్' గూర్చి రాసి మన పాత రోజుల్ని బాగా జ్గప్తికి తెచ్చావు . ధన్యవాదాలు మిత్రమా! వేసుకో ఒక అల్లం, మిర్చి పెసరట్టు. మన శంకర నారాయణ దగ్గర 'ఇడ్లి సాంబార్' గురించి మాట్లాడితే ఎవరికీ నోట్లో నీళ్ళూరావు? చంద్ర శేఖరు, రాజగోపాల్ ని ఎలా మర్చిపోగలము . నాయన పుచ్చ ఆ నిక్కరు , బనీను శాల్తీ పేరు "బాలయ్య" , మన హీరో . మైసూరు కేఫ్ లేకపోవటం బ్రాడిపేట కే ఒక పెద్ద లోపం. ఇందులో రాజకీయం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
    గో వె ర

    ReplyDelete
  21. @Go Ve Ra,

    మైసూర్ కేఫ్ అనంగాన్లే ఎక్కడ లేని హుషారు వచ్చిందే!

    ఎనకటికి నీలాంటోడే.. 'సూర్యుడుని చూడుము.' అంటూ వేలితో సూర్యుణ్ణి చూపిస్తే 'సూర్యుడి సంగతేమో గానీ.. వేలు చాలా బాగుంది.' అన్నాట్ట!!

    ReplyDelete
  22. రమణ మామా!

    మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ ఉదాహరణగా రాజకీయ పాఠం చక్కగా "సుబ్బు" చేత చెప్పించావు. అలమలం!! "సింగిల్ ఇడ్లీ బక్కెట్ సాంబార్" లాగించిన కారణన మనం లక్ష గాలన్ల పైనే సాంబారు తాగి ఉండవచ్చు. ఇక పొతే నువ్వు సక్సెస్ అయిన హోటళ్ళ గురించే వ్రాశావు. కానీ గొప్పగా ప్రారంభోత్సవం చేసి ఏడాది లోపే బోర్డు తిప్పిన "దివాళా హొటళ్ళు" (ఉదాహరణకి మన చిరు హోటల్) గురించి స్తలాభావం వల్ల వ్రాయలేదా? మొత్తానికి పొడుగాయన చెప్పినట్టు మూడు ముక్కల అట్టులా అదర గొట్టావు. మధ్యలో ఫోన్ కాన్వర్సేషన్స్ "అదుర్స్"

    దినకర్.

    ReplyDelete
  23. Dinkar,

    థాంక్యూ!

    అవును. చిరంజీవిది దివాళా తీసిన హోటలే!

    కాకపోతే.. ఈ మధ్య నా పోస్టుల్లో చిరంజీవి రిపీట్ అవుతున్నాడు. ఈ సారికి ఎవాయిడ్ చేశాను.

    ReplyDelete
  24. డాక్టర్ గారు,

    నిన్నంతా అఫీసులో పనికిరాని విషయాల మీద ఎంక్వైరీలు.ఆ బాధలో ఉన్నాను
    మనసేం బాలేదు అందుకే కామెంట్ రాయలేక పోతున్నాను
    ఈ మనసునే కంట్రోల్ చెసుకోలేక పొతున్నాన్ను.
    తప్పు చేయక పోయినా దోషిగా నిలబడాలంటే కష్టం.

    జి రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  25. చాలా బాగుంది . బిజెపి , కమ్యు నిస్టులకు మాత్రమే సిద్ధాంతాలు ఉన్నాయి. ( కొందరు తప్పుడు నాయకులు ఉండ వచ్చు కానీ కాగితాలకే పరిమితం కాదు ఆ పార్టీ లకు నిజంగానే సిద్ధాంతాలు ఉన్నాయి ) బాబు గురించి చాలా తక్కువగా రాశారు . ఆతను నిన్నటి ఇడ్లీని తాజా ఇడ్లీ అని నమ్మించి అమ్మి , చివరకు నమ్మకం కోల్పోయారు. తాజా ఇడ్లీని అమ్మినా కృత్రిమ పొగలు ఏర్పాటు చేసి అమ్ము తున్నారని అనుమానించే పరిస్థితి తెచ్చు కున్నారు . అతని ఇడ్లిల గొప్పతనం అతనే పదే పదే చెప్పి ఇడ్లీ అంటేనే విరక్తి కలిగేట్టు చేశారు

    ReplyDelete
  26. buddha murali గారు,

    చంద్రబాబు ఇడ్లీల గూర్చి చక్కని వ్యాఖ్య రాశారు. థాంక్యూ!

    ఇడ్లీ, అట్టు (నాకివి చాలా ఇష్టం) కాంసెప్ట్ తో సరదాగా రాజకీయ విశ్లేషణ చేశాను.

    మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.

    ReplyDelete
  27. ఆహా!

    సుబ్బు వస్తే ఎంతైనా పోస్ట్ కి బలే కళ వచ్చేస్తుంది డాక్టర్ గారు!
    ఈ టిఫిన్లు, కేఫ్ లు గురించి చదివి ఇపుడే లంచ్ కి వెళ్తే, అక్కడ శాండ్విచ్ లు అవి చూసి చెప్పలేని బాధ!

    ఐనా సరే, పోస్ట్ అదుర్స్!

    ReplyDelete
  28. Krishna Palakollu గారు,

    మీ కామెంట్ సుబ్బుకి చెబుతాను. చాలా సంతోషిస్తాడు.

    మా సుబ్బు పాతకాలం మనిషి లేండి. వాడికి ఇడ్లీలు దోశలే ఇష్టం. అందుకే చాలా బయాస్డ్ గా మాట్లాడతాడు. మీరు మీ సాండ్విచ్ లు హాయిగా లాగించెయ్యండి.

    ReplyDelete
  29. ఏం రాస్తున్నారండీ బాబూ, ఈర్ష్య పుట్టుకొచ్చేస్తుంది సుమండీ. ఇలా రాయడం చాలా కష్టమండి. గుడ్డు పెట్టే ప్రతికోడికి ఈ కష్టం తెలుసండి. ఈ అవినీతిమయ రోగగ్రస్త వ్యవస్థలో...అని రాక్షసభాషలో రాయడం సులువండి. మీలా రాయడం చాలాచాలా కష్టమండి. పాండిత్యం కన్నా జ్ఞానం ముఖ్యం కదండి. అది మీ దగ్గర టన్నుల కొద్దీ ఉందని అర్థమవుతోందండి. మీరు మామూలోళ్లు కాదండీ బాబూ! మీకు వేయి వీరతాళ్లండి.
    జి ఎస్‌ రామ్మోహన్‌

    ReplyDelete
  30. గుంటూరు (మా అమ్మమ్మ వాళ్ళ ఊరు) ని మైసూరు కేఫ్ ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. సమకాలీన రాజకీయాల ని బాగా చెప్పారు హోటలు భాషలో.

    ReplyDelete
  31. @మోహనరాగం,

    జి ఎస్‌ రామ్మోహన్‌ గారు,

    వావ్! మీరు నన్ను మెచ్చుకోవడం నాకు లభించిన గొప్ప సర్టిఫికేట్ గా భావిస్తున్నాను. చాలా చాలా చాలా థాంక్సండి!

    ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయిన మీ ఆర్టికల్ (12-10-11) నాకు తెగ నచ్చేసి నా బ్లాగులో పెట్టేసుకున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

    ReplyDelete
  32. @అనగనగా ఓ కుర్రాడు,

    థాంక్యూ!

    ReplyDelete
  33. *వావ్! మీరు నన్ను మెచ్చుకోవడం నాకు లభించిన గొప్ప సర్టిఫికేట్ గా భావిస్తున్నాను. *
    రమణగారు,
    ఇదేమి బాగా లేదండి. ఇప్పటివరకు మీరు రాసిన ప్రతి టాపాను మెచ్చుకొన్న, నాలాంటి సాధారణ పాఠకులపైన మీకు చిన్న చూపు ఉన్నాదనిపిస్తోంది :)

    SriRam

    ReplyDelete
  34. *వావ్! మీరు నన్ను మెచ్చుకోవడం నాకు లభించిన గొప్ప సర్టిఫికేట్ గా భావిస్తున్నాను. *
    రమణగారు,
    ఇదేమి బాగా లేదండి. ఇప్పటివరకు మీరు రాసిన ప్రతి టాపాను మెచ్చుకొన్న, నాలాంటి సాధారణ పాఠకులపైన మీకు చిన్న చూపు ఉన్నాదనిపిస్తోంది :)

    SriRam

    ReplyDelete
  35. SriRam గారు,

    మీరు నన్ను క్షమించాలి.

    నా బ్లాగ్ చదువుతూ, కామెంట్లు రాస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి కామెంట్లే లేకపోతే నాకు ఇన్ని టపాలు రాసే ఉత్సాహం, ఓపికా ఉండేవి కావు. సరదాకి మొదలెట్టి.. ఇప్పుడు బ్లాగ్ రాయకుండా ఉండలేని స్థితికి వచ్చాను.

    జి ఎస్‌ రామ్మోహన్‌ గారి రచనలు నాకు ఇష్టం. ఆయన నుండి మెచ్చుకోళ్ళు రాంగాన్లే సహజంగానే excite అయ్యాను. ఆ ఉత్సాహంలో రాసిన వ్యాఖ్య అది. దయచేసి అర్ధం చేసుకోగలరు.

    ReplyDelete
  36. ఏమండోయ్ దాటేరు గారు,

    ఉడిపి హోటలు, ఉడాలు టపా అదురహోయ్

    ఉడిపి హోటలు కున్ను, రాజకీయ పార్టీల కున్నూ గల సామరస్య సాంబారు సారూప్యతల ను విశదీకరించిన మీకు ఇవే 'సా' అంబానీ సమేత సంభావన అందు కోండి.

    ఇక చిరు హోటలు గురించి మధ్య లో అడిగేరు కొందరు. 'తిరుపతయ్య బోడి గుండు కథ ' = http://www.funzilebi.blogspot.com లో చదవగలరు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  37. Zilebi గారు,

    థాంక్యూ!

    మీరిచ్చిన లింకులో 'తిరుపతయ్య బోడి గుండు కథ' కనబడలేదండి!

    ReplyDelete
  38. భలే చెప్పారు రమణగారు..... ఎవరైనా రాజకీయాలు తెలియవన్నా, అర్థం కాలేదన్నా మీ సుబ్బు దగ్గరకు పంపిచేయాలి. అసలు హోటల్ వ్యాపారానికి, రాజకీయానికి లింకు భలే కుదిరింది లెండి, మీ ఆలోచన అద్భుతం.

    ReplyDelete
  39. మనోజ్ఞ గారు,

    ధన్యవాదాలు. సుబ్బు ఆలోచనలు చాలా సింపుల్. ఇంతకు ముందు తెలుగు భాషాభిమానానికీ, పెసరట్టుకీ లింకు పెట్టాడు. ఇప్పుడు రాజకీయాల్ని హొటళ్ళతో ముడి పెట్టాడు. మీకు నచ్చినందుకు సంతోషం. సుబ్బుకి తెలియజేస్తాను.

    ReplyDelete
  40. Super Sir. I left Guntur in 1995. But still remember the Mysore Cafe Sambar

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.